Wednesday, April 4, 2018

మనకవితలు టీమ్

మాతృభాష మాధుర్యం! ( MATRU BHASHA KAVITHALU TELUGU)



మాతృభాష మాధుర్యం!

భరత ఖండమందు తెలుగు రాష్ట్రమ్ములో
తెలుగు తల్లి పాలు లెస్స త్రాగి
అమృతమ్మువంటి “అమ్మ” పదము మరచి
“మమ్మి”యనుచు లెస్స తిరిగినావు

రెక్కలొచ్చిన పక్షి ఎగిరిపోయిన రీతి
విత్తంబు కోసమై విదేశాలకేగి
ఉద్యొగంబులేక ఊడిగాలు చేసి
మాతృ భాషనేమొ మరచినావు

ఆరంభ శూరడు ఆంధ్రడేనటంచు
మధ్యలోనె తెలుగు మరచినావు
పరభాష మోజులో మాతృభాషను మరచి
తెలుగుతల్లికి ద్రోహంబు చేసినావు

అవలక్షణాలున్న ఆంగ్లభాష కన్న
తేనెలొలుకుచున్న తెలుగుభాష మిన్న
రాయలు మెచ్చిన రాజభాష తెలుగు
మధురమైనట్టిది మాతృభాష తెలుగు

తెలుగు బిడ్డనంచు తెగచెప్పుకొని నీవు
ఆంగ్లభాషలోన అతి “ప్రయాసగ” మాట్లాడి
మాతృభాష యనగ మౌనంబు వహిoచి
తెలుగు భాషకు తెగులు సోకించినావు

తెలుగునాట బుట్టి తెలుగునాట పెరిగి
తెలుగు సంస్కృతియు తెలిసి నీవు
అన్య భాషలోన అతి“యాసగ”మాట్లాడి
తెలుగు తెలియనట్లు తెగ ఫొజులిస్తివి!

పొరుగు రాష్ట్రాలలో అతిదొడ్డ మనసుతో
మాతృభాషలోన మధురంగ మాట్లాడి
మాతృ భాషామతల్లిని బహుగ రక్షించగ
తెలుగు మాట్లాడుటకు “తెగసిగ్గు” పడితివి!

ఇంగిలీషులోన ఎంగిలి చదువులు
మాతృభాషయన్న మరిమరి చులకన
పరభాషయందున పెద్దచదువులంటు
పరదేశములకేగి పాట్లెన్నొ పడితివి!

ఒంటినిండ బట్ట కంటికి బహు ఇంపు
అర్ధభాగము బయట వెగటు పుట్టు
పరదేశ పోకడలు పరమ దౌర్భాగ్యంబు
ఒచ్చిరాని భాష ఒంటికి బహు చేటు

ఆకలి దప్పులకు ఆంగ్లమ్ము నేర్చినా
పైచదువులకంటు పరదేశమేగినా
అమ్మవంటి బహుగ కమ్మనైన తెలుగు
మాతృభాషనెపుడు మరువబోకుము సుమీ!

మాతృభాషలోన పరిపాలనను జరుప
ఉత్తర్వులెన్నియో వెడలుచున్ననుగాని
మానసంబున నీకు మాతృభాషపైన
ప్రేమ పుట్టకపోతె ఫలితమేమి ?

విజ్ఞులైనవారు విషయంబు గ్రహియించి
తెలుగుతల్లి హృదయస్పందనను గమనించి
నిత్యజీవితాన అత్యంత ప్రేమతో
మాతృభాష తెలుగు మరువకుందురుగాక !
***
.
.
.
.
.
.
నాగులవంచ వసంతరావు.....



మనకవితలు టీమ్

About మనకవితలు టీమ్ -

Subscribe to this Blog via Email :

Please add your valuable comments.
But don't misuse it ...