Wednesday, March 21, 2018

మనకవితలు టీమ్

విద్యార్థీ మేలుకో ! ( VIDHYARDHI MELUKO TELUGU KAVITHALU ABOUT STUDENTS )



విద్యార్థీ మేలుకో! విద్య విలువ తెలుసుకో!!
బంగారు భవిష్యత్తుకు పునాదులు వేసుకో

విద్యార్థీ లేవరా కనులు తెరచి చూడరా
నీదూ హస్తంబులలో విశ్వభవిత గలదురా

క్లాసులోన పాఠాలను శ్రద్దగ నువు వినుమురా
ఇంటికొచ్చినాక మరల తిరగవేసి చూడరా

నిన్నునిండ ముంచునిద్ర మర్మమేదొ దెలియరా
నిత్యం నువు జాగ్రత్తతొ నిద్ర మేల్కొమ్మురా


సినిమాలని షికార్లని లెస్స తిరగమాకురా
కొద్దిపాటి ఓర్పుతోడ విజయం వరిOచరా

చెడ్డవారి సహవాసం చేసి చెడిపోకురా
మంచివారితో ఎప్పుడు మసలుకుంటె మేలురా


చరవాణి సంభాషణంటె చెవులు కోసుకోకురా
విలువైన సమయాన్ని వృధా చేసుకోకురా

వ్యాట్సాప్ సందేశాల వలలొ చిక్కబోకురా
నిక్కమైన నిజమేదో నిలకడగా పంపరా

ఫేస్ బుక్ ధ్యాసలొబడి నోట్ బుక్ మరువకురా
అంతర్జాల మాయలొబడి ఆగమై పోకురా


మత్తు పదార్ధాల వెంట మాయలబడి పోకురా
బాంగారు భవిష్యత్తును బుగ్గి చేసుకోకురా

బాయ్ ఫ్రెండ్ గాళ్ ఫ్రెండ్ భ్రాంతిలొ నువుబడకురా
పిన్నవయసులోనె ప్రేమ ఉన్మాదివి గాకురా

ర్యాగింగుల ముసుగులో చిత్రహింసల పాలు చేసి
బ్రతుకుపైన ఆశవదలి బలిపశువుగ మార్చకురా

విదేశీయ విష సంస్కృతి విరివిగాదరించి నీవు
భరతమాత గుండెలను బరగ జీల్చమాకురా


నిన్నుగన్న తలిదండ్రుల ఆశలు నెరవేర్చరా
విద్యార్థి లోకంబులొ మిన్నగ నువు నిలవరా

అల్పసుఖములెల్ల నీవు అంతరింపజేయరా
అంతులేని జ్ఞాననిధుల బొందీ సుఖిOచరా

చిన్నచిన్నవిజయాలతొ సంతృప్తినిబొందకురా
విశ్వమంత పొగడునంత విజ్ఞానివి గమ్మురా

హిమాలయమంత నీవు ఎత్తుఎదిగి చూపరా
అఖిల జగతికి నీవు ఆదర్శం గమ్మురా

గురువు పెద్దలయందు గౌరవంబు జూపరా
పెద్దవారి ఆశీస్సులు వ్యర్ధం గాబోవురా


నీకు చదువు నేర్పినగురు ఋణముదీర్చుకొమ్మురా
గురువు కృపనుబొంది నీవు విశ్వఖ్యాతినొందరా!
***
రచన: నాగులవంచ వసంతరావు





మనకవితలు టీమ్

About మనకవితలు టీమ్ -

Subscribe to this Blog via Email :

Please add your valuable comments.
But don't misuse it ...