Monday, December 25, 2017

Manakavitalu Team

దివ్యుడా! కనువిప్పుకో!! అందమైన తెలుగు కవితలు తెలుగులో ( ANDAMAINA TELUGU KAVITHALU )




దివ్యుడా! కనువిప్పుకో!!


ఆత్మవీర లేవర! అజ్ఞాన పథము వీడరా!
సకల జీవరాసులలో స్వామిని దర్శించరా!

బుల్లిబుల్లి నడకలతో బాల్యమంత గడిచిపోయె
చిట్టిచిట్టి మాటలతో చిరుప్రాయం కరిగిపోయె

విద్య ఉద్యోగమంటు విదేశాలకేగినావు
ఉద్యోగం దొరకదాయె ఊడిగాలు తప్పవాయె

డాలర్లు, యూరోలు, పౌండ్లెన్నొ పంపినావు
ముదుసలైనతల్లిదండ్రలవృద్ధాశ్రమాల జేర్చినావు


పచ్చగ కళకళలాడే పల్లెటూళ్ళు బోసిబోయె
పల్లెలోని జనమంతా పట్నాలకు వలసబోయె

పశు పక్షిజాతి అంతరించె పల్లెలన్ని మోడువారె
జీవరాశి సమతుల్యత ఘోరంగా మారిపోయె

శిధిలమైన ఇండ్లున్న పల్లెసీమల గాంచినంత
గతవైభవ జ్ఞాపకాలు గుండెను పిండేస్తాయి

యవ్వనంపు పొంగులలో ఇంద్రియాల  పరుగులలో
ఎండమావి సుఖములకై వడివడి దరిజేరినావు

సుందర దేహంబుజూసి చిందులెన్నొ వేసినావు
అంతరాత్మ ప్రభోదాన్ని అణగదొక్క జూసినావు

పెదవిపైన చిరునగవులు మనసులోన ద్వేషాగ్నులు
కపట నాటకంబులతో జీవితమ్ము సమసిపోయె





ప్రతిమల పూజించనేర్చి ప్రాణుల హింసించినావు
సకల జీవరాసులలో స్వామిని దర్శించలేక


బలంబాగ వస్తుందని జీవులారగించినావు
చావు దగ్గరైనవేళ చతికిలబడి పోయినావు

బలంబేడ బోయెర నీ బతుకేమై పోయెర
శాకాహారంబులోనె శక్తున్నది చూడర

గుడులు గోపురాలంటు దేశమంత తిరిగినావు
గుండెలోని దైవాన్ని గాంచలేకపోయి నీవు

తానె దైవంబన్న తత్త్వంబును దెలియలేక
కస్తూరి మృగంవోలె కంగారుగ తిరిగినావు

గురువే మన సర్వస్వం పెద్దలు మన అస్తిత్వం
సకల జీవరాసులను ప్రేమించుట మన తత్వం

త్రిగుణాలలొ జిక్కినీవు తిప్పలెన్నొ బడుచుంటివి
మాయచేత పెడతన్నులు దండిగ నువు దినుచుంటివి

జీవులెనుబది నాలుగులక్షల దేహాలలొ జేరినావు
బహుజన్మల పుణ్యంబున మానవజన్మ మెత్తినావు

కాలమెల్ల కరిగిపోయె వయసేమొ తరిగిపోయె
మృత్యువేమొ ముంచుకొచ్చె బ్రతుకుఆశ చావదాయె

కళేబరంబు గాంచినంత వైరాగ్యం లెస్సబెంచి
స్మశానంబు దాటగనె మాయలొబడి పోతివోయి

మాటవినని మనసుజేరి మాయచేత జిక్కినావు
మానవ పరమార్థమైన జ్ఞానంబును మరచినావు                                                                        
                                                                                           
                                 //
ఆత్మవీర//                                 

  రచన: నాగులవంచ వసంతరావు

Manakavitalu Team

About Manakavitalu Team -

Subscribe to this Blog via Email :

Please add your valuable comments.
But don't misuse it ...