Thursday, March 15, 2018

మనకవితలు టీమ్

జీవితం ( JEEVITAM telugu kavithalu on life )




జీవిత పరమార్థం...

అనంత కాలచక్రంలో
జీవితకాలం అల్పమే ఐనా
శతకోటి సుగంధాల
పరిమళమాల జీవితం

ఉత్సాహంగా పనిచేస్తూ
ఆనందంగా జీవిస్తూ
సాటివారికి సాయం చేయడమే
సరియైన జీవితం

సద్భావనలు పెంచుకొని
సన్మార్గాన పయనిస్తూ
సమత, మమత, మానవతలు
పరిఢవిల్లేదే జీవితం


ఆదర్శాలను ఆచరణలో
ప్రతిపనిలో ప్రతిబింబిస్తూ
తెరచిన పుస్తకంలా ఉండేదే
అసలైన జీవితం

దురలవాట్లతో దిగజార్చుకుంటే
దు:ఖ సాగరమౌతుంది
మలచుకోగల నేర్పు ఉంటే
మహోన్నత శిఖరమౌతుంది

సంసార సాగరంలో
సమస్యల తిమింగలాలు
అలజడులు రేపినా
అల్లకల్లొలాలు సృష్ఠించినా
సుడిగుండాలుగా మారి
సునామీలా విరుచుకుపడినా
మొక్కవోని ఆత్మవిస్వాసంతో
మనగలిగేదే జీవితం

ఆదర్శాలను ఆచరణలో
అమలు జరుపబోతే
సహించలేని సభ్యసమాజం
తూలనాడినా అభాంఢాలువేసి
అభాసుపాలు చేసినా
గుండె నిబ్బరంతో
ముందుకు సాగేదే జీవితం

నీవునమ్మిన సిద్దాంతాలతో
ఎవరూ ఏకీభవించకున్నా
అంతరాత్మ ప్రభోదానికి
అనుగుణంగా ఉన్నప్పుడు


ప్రపంచమంతా ఏకమై ఎదిరించినా
నిందించి నీరుగార్చినా
అహర్నిశలు ఆత్మోన్నతికి
శ్రమించడమే అసలై నజీవితం


మనసును నిగ్రహించి
అరిషడ్వర్గాలను  జయించి
అనునిత్యం ఆత్మానందంలో
మునగడమే దివ్యజీవనం

"బలమే జీవితం –
బలహీనతయే మరణం"
అనిచాటిన స్వామి వివేకానంద
సింహగర్జనకు స్పందించి
పరిపూర్ణమైన ఆరోగ్యంతో
మానసిక వికాసంతో
విశాల హృదయంతో
వర్తించగలిగినదే విలువైన జీవితం

బహుజన్మల పుణ్యపాకవశాన
భగవంతుడిచ్చిన వరం
84 లక్షల జీవరాసులలో
ఉత్కృష్ఠమైనది మానవజన్మ
విషయ వాసనలను విసర్జించి
స్థితప్రజ్ఞతను సాధించి
ఆత్మజ్ఞానాన్ని సంపాదించినదే
పరిపూర్ణ జీవితం


***
నాగులవంచ వసంతరావు......





మనకవితలు టీమ్

About మనకవితలు టీమ్ -

Subscribe to this Blog via Email :

Please add your valuable comments.
But don't misuse it ...