Saturday, December 23, 2017

మనకవితలు టీమ్

ఒక్క మొక్క నాటండి తెలుగు పర్యావరణ సంరక్షణ కవితలు ( TELUGU PARYAVARANA RAKSHANA KAVITHALU )



ఒక్క మొక్క నాటండి!



అన్నలార అక్కలార ఒక్కమొక్క నాటండి
చెట్టుచేసె మేలేమిటొ ఈజగతికి చాటండి

మొక్కపెట్టి మట్టివేసి నీరుపోసి కంచెవేసి
చంటిపాప వలెనుదాన్ని సతతం కాపాడండి

ఊరువాడ పట్నమంత ఉప్పెనలా కదలండి
ఉరకలేస్తు మొక్కనాటి ఉత్తేజం పెంచండి


మొక్కనాటినంతనె మన భాద్యత తీరదోయి
పెరిగి పెద్దదయేదాక చక్కగ కాపాడవోయి

దినదినము మొక్కపెరిగి వృక్షమైపోతుంటె
మనకు కలిగె ఆనందం మరువలేము ఈ జన్మకు

అందమైన చిగురింపుకు అవని పులకరిస్తుంటె
సృష్టిలోని ప్రతి ప్రాణి పరవశించిపోతుంది

నీ చల్లని గాలికేమొ ఒల్లు జలదరిస్తుంది
నీ మెల్లని పిల్లగాలి మనసు హాయినిస్తుంది

దట్టపు మేఘాలుచేరి దండిగ వర్షిస్తుంటె
ధరణి పులకరిస్తుంది చెరువు అలుగుపోస్తుంది

నీ నీడన పవళిస్తే నిదుర బాగ పడుతుంది
నీ పళ్ళను భుజియిస్తే కడుపు నిండిపోతుంది


ఇంటిముందు నీడనిచ్చి ఇలవేల్పువైతివి
ఆకుపచ్చ చీరకట్టి అందాలొలుక బోస్తివి


పచ్చనైన పైరుచూడ కడుపు నిండిపోతుంది
రైతన్న ముఖంలోన నవ్వు తొంగిచూస్తుంది

దట్టమైన అడవులతో దండిగ వానలుకురియ
దిట్టమైన పంటలతో ధీమాగబతుకు రైతన్న

బీటలెత్తిన బీడులన్ని బురదమల్లుగా మారి
ధాన్యరాసులతోటి గరిసెలన్ని నిండంగ

రైతన్న కళ్ళలోన ఆనంద భాష్పాలు
అప్పులన్ని తీరునన్న ఆశావహ భావాలు

ఆకుపచ్చ తెలుగు సీమ అందమేదొ చూడర
మొక్కనాటి పెద్దచేసి జాతికుపకరించర

కాలుష్యం తరిమికొట్టి ఆక్సీజన్ అందిపుచ్చి
పర్యావరణం పదిలమని మనను హెచ్చరిస్తుంది

చెట్టునరికి కోరికోరి చెరుపు తెచ్చుకోకుర
చెట్టు నరికినోడికి పుట్టగతులు లేవుర


ప్రతి ఒక్కరు ఒక మొక్కను ప్రేమతో నాటుదాం
తెలుగు వాళ్ళ ఘనతేమిటొ ఈ జగతికి చాటుదాం!
***



రచన: నాగులవంచ వసంతరావు


మనకవితలు టీమ్

About మనకవితలు టీమ్ -

Subscribe to this Blog via Email :

Please add your valuable comments.
But don't misuse it ...