Sunday, December 17, 2017

మనకవితలు టీమ్

అమ్మ అందమైన కల! ( AMMA KOSAM TELUGU KAVITHALU )



అమ్మ అందమైన కల!


అమ్మ ఎపుడు కంటుంది అందమైన కలలు
ముచ్చటైన తన బిడ్డ గొప్పగ ఎదగాలని

స్త్రీ గర్భధారణతో ప్రారంభమైన కలలు
ప్రసవించిన పాపతో సాకారమగును ఇలలో

దినదినము బిడ్డ పెరిగి పెద్దదైన విధము
తల్లి మనసు తపియించును పాప పెరుగుదలను


చిరునగవులు చిందించిన బిడ్డ చిలిపితనము
కలకాలం నిలవాలని అమ్మ ఇచ్చు వరము

ఎదలోని ప్రేమనంత ఏకంగా పోగుచేసి
ఉగ్గుపాలు అందించును ఉదయించిన పసిపాపకు

గారాబం ఒలకబోసి మురిపాలతో ముంచెత్తి
మదిలోని మమతనంత ముద్దులలో మూటగట్టి

ప్రతి క్షణము పరితపించు బిడ్డ బాగుకొరకు
పెరిగి పెద్దదై గొప్ప పేరు తెచ్చు వరకు

విద్యలలో ఆరితేరి పేరుగన్న క్షణము
ఆనందపు భాష్పాలతొ చెమ్మగిల్లు కనులు

కుటుంబ బాధ్యతలు చక్కగ నెరవేర్చుచు
సామాజిక స్పృహతొ వంశ గౌరవాన్ని పెంచి

ఆకాశమె సరిహద్దుగ అభివృద్ధి చెందు క్షణము
అమ్మ మనసు పరవశించు ఆనందపు ఝరిలో

సాంగత్య దోషముచే చెడిపోయిన క్షణము
తల్లి మనసు తల్లడిల్లి సొమ్మసిల్లు ఇలను
***
.
.
.
.
- నాగులవంచ వసంత రావు




మనకవితలు టీమ్

About మనకవితలు టీమ్ -

Subscribe to this Blog via Email :

Please add your valuable comments.
But don't misuse it ...